My world is small where I can scribble my thoughts, hobbies and the way I see the world around.
Tuesday, March 20, 2012
UGADI SUBHAKANKSHALU
Sunday, January 29, 2012
Radha Saptami
రధ సప్తమి
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమిని రధ సప్తమిగా జరుపుకోవడం ఆచారం. "ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్" అని వేదోక్తి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అలాంటి ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యనారాయణుడు. ప్రత్యక్షంగా కనబడే ఏకైక భగవానుడు కాబట్టే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడన్నారు. సూర్యనారాయణమూర్తి అత్యల్ప సంతోషి కూడా. "ఆదిత్యో నమస్కార ప్రియః". ఆయన ఎదురుగా నిలచి చేతులు రెండు శిరసు పై జోడించి నమస్కరిస్తే చాలు, అడిగినవన్నీ ప్రసాదించే దైవం ఆయన. ఇంద్రధనుస్సులోని ఏడు రంగులను ప్రతిఫలించే ఏడు అశ్వాలను పూన్చిన, ఒకే చక్రం కలిగిన రథం సూర్యనారాయణుని వాహనం. సూర్యుని ద్వాదశ నామాలు - మిత్ర, రవి, సుర్య, ఖగ, అహను, పూషణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. సూర్యనారాయణ స్వామికి భారతదేశంలో కోవెలలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒరిస్సాలోని కోణార్క్ లోని సూర్యదేవాలయం సముద్రతీరంలో వెలసింది. కాలక్రమేణా శిధిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయంలో ప్రస్తుతం పూజాధికాలు జరగటంలేదు. రెండవది, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం దగ్గరలో గల అరసవల్లి. ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యమైనది మరియు పురాతనమైనది. ప్రతీ సంవత్సరం, రధసప్తమి రోజు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై ప్రసరిస్తాయి. సంవత్సరం మొత్తంమీద ఈ విశేషం ఈ ఒక్క రోజు మాత్రమే కనిపిస్తుంది. ఈ వేడుక చూడడానికి ఎక్కడెక్కడనుంచో భక్తులు వస్తుంటారు. మూడవదేవాలయం తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో కల సూర్యన్ కోవిల్. భారతదేశంలో ఇక్కడ ఒక్క చోటమాత్రమే నవగ్రహాలకు విడివిడిగా ఆలయాలున్నాయి.
రథ సప్తమినే మాఘ సప్తమి, జయ సప్తమి, మహా సప్తమి అని కూడా వ్యవహరిస్తుంటారు. రథ సప్తమి రోజు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తాడు.ఈ ప్రవేశ కాలాన్ని చాల పుణ్య ప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టే భీష్ముడు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేవరకు వేచి యుండి దేహ త్యాగం చేశాడు. ఈ రోజున మరణించినవాళ్ళు నేరుగా వైకుంఠం చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి.
రథసప్తమినాడు, తెల్లజిల్లేడు ఆకుమీద రేగిపండు ఉంచి, శిరసుమీద, రెండు భుజాలమీద పెట్టుకుని సూర్యునికి ఎదురుగా నిలబడి శిరస్నానమాచరిస్తే ఎటువంటి రోగాలైనా నయమవుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు విశేషమైనవని ఆయుర్వేదం కూడా తెలియచేస్తోంది.
స్నానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రం పఠిస్తూ స్నానం చేయాలి.
సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరాసప్తార్క ప్రమాణాయ సప్తమీ రథసప్తమీ
కొంతమంది ఈ క్రింది మంత్రాన్ని పఠించాలని చెప్తారు
యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్జన్మకృతం పాపం జచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జాతాజాతం చ యత్పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తకే
సప్తవ్యాధిసమాయుక్తం హర మాకరి సప్తమి.
స్నానం చేసిన తరువాత సూర్యునికి ఈ క్రింది మంత్రం చెపుతూ అర్ఘ్యం ఇవ్వాలి.
సప్త సప్త వహప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
సూర్యభగవానుడిని శోడశోపచారాలతో అర్చించి, చిక్కుడు కాయలతో, చిక్కుడు ఆకుతో రథాన్ని తయారుచేసి దానిలో ఆవు పిడకలపై, ఆవుపాలతో చేసిన బియ్యం పాయసాన్ని నైవేద్యం గా అర్పిస్తే ఆ సూర్యనారాయణుడు అఖండ ఆయురారోగ్యాలను ఇస్తాడు.