Tuesday, March 20, 2012

UGADI SUBHAKANKSHALU

నందననామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.
             ఉగాది తెలుగువారి పండుగలలో ముఖ్యమైన పండుగ. ఈ పండుగను సంవత్సరాదిగా (కొత్త సంవత్సరానికి ప్రారంభంగా) జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి, చైత్ర శుద్ధ పాడ్యమినాడు నూతన సంవత్సరానికి నాందిగా ఈ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. పల్లెల్లో ఈ పండుగను కొత్త అమావాస్య పేరుతో వ్యవహరిస్తారు. ఈ రోజునుంచి వసంతఋతువు ప్రారంభమవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం, చంద్రుని గమనాన్ని అనుసరించి, ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. గ్రహ, నక్షత్ర గతులను బట్టి, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది ? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి ? దేశంలో రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది? వర్ష ఫలాలు, పంటలు మొదలైనవి ఏ విధంగా ఉంటాయి మొదలైనవి పంచాంగ పరంగా వి శ్లేషణ చేస్తారు. పంచాగ శ్రవణానికి ఉగాది రోజున చాలా ప్రాముఖ్యాన్నిస్తారు. దక్షిణభారత దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర లలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మహరాష్ట్రలో ఈ పండుగను గుడిపడవగా వ్యవహరిస్తారు. 

          మామిడి తోరణాలను, బంతిపూదండలను గుమ్మాలకు కట్టి, కొత్తబట్టలతో ……బంధుమిత్రులతో ఈ పండుగను ఇంటిల్లిపాది కలిసి ఆనందంగా చేసుకొంటారు. ఉగాది నాడు షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితం అన్నిరుచుల కలయిక అని తెలియచేస్తుందీ ఉగాది పచ్చడి. ఆరోగ్యపరంగా ఈ ఉగాది పచ్చడిలో వేసే వేపపువ్వు, మామిడి కాయ, చెరకు, బెల్లం, కొత్తచింతపండు మొదలైనవన్నీ పైత్యాన్ని తగ్గించి జీర్ణశక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. ఉగాది నాడు సాధారణంగా ప్రతి ఇంట్లో చేసుకొనే వంటకాలు పులిహోర, బొబ్బట్లు.సంవత్సరాది నాడు ఆనందంగా ఉంటే, ఆ సంవత్సరమంతా ఆనందంగా గడుస్తుందని విశ్వాసం. అందుకే అందరూ సంవత్సరాదిని ఆనందంగా గడపడానికి చూస్తారు. 

          ఉగాదినాడు ఇంటిల్లిపాది తలస్నానం చేసి, దేవుడికి పూజ చేస్తారు. ముందుగా వినాయకుడిని పూజించి, కొత్తసంవత్సరంలో ఏవిధమైన విఘ్నాలు లేకుండా చూడమని ప్రార్ధిస్తారు. తరువాత కొత్త సంవత్సరమంతా భోగ భాగ్యాలతో ఉండేలా చూడమని లక్ష్మీదేవిని అర్చిస్తారు. నవగ్రహాలను వారి శుభదృష్టిని అనుగ్రహించేలా వేడుకుంటారు. తరువాత వండుకున్న పిండివంటలను భగవంతునికి నివేదించి ఇంటిల్లి పాది భుజిస్తారు. 
          ఈ నందననామ ఉగాది మీ అందరికి సకల సౌభాగ్యాలను అందించాలని ఆశిస్తూ....
                                   మీ విశ్వనాధ్ కూచిభొట్ల

No comments: