Monday, February 24, 2020

దేవుడా కాపాడు నా దేశాన్ని...
చదువుకున్న నిరక్షరాస్యుల నుంచి....
కళ్ళున్న గుడ్డివాళ్ళ నుంచి...
చెవులున్న బధిరుల నుంచి....
విచక్షణ ఉన్న మూర్ఖుల నుంచి...

దొంగాడికి రాజ్యం ఇస్తే రక్షణ ఎక్కువట....
దోపిడి దారుకు పెత్తనం ఇస్తే ...
కొత్తగా దోచుకోవటానికి ఏమీ లేదు కనుక
దాచుకోవడం మినహా కొత్త దందాలుండవట....

నోటుకు వోటు తప్పురా బాబూ అంటే....
దోచుకున్నది మన సొమ్మేకదా....
ఇలా తిరిగి తీసుకుంటే తప్పేంటనే వాదన..
ఐదువందలు తీసుకుంటే కక్కుర్తి కానీ...
ఐదువేలు తీసుకుంటే రాయల్టీ అట...

ఐదుసంవత్సరాల మన తలరాత అంటే...
అరవై సంవత్సరాలుగా మారనిది...
ఐదు సంవత్సరాలలో ఏం మారుతుంది... నీ పిచ్చి గానీ
అయినా.... మనకి తలలుంటే కదా రాతలు...
తలలన్నీ తలర్లకిచ్చేసాక... ఇంకా దేనికి ఆలోచనలట...

"అందరూ దొంగలే అయినపుడు...
మన దేశమే పెద్ద కంబళి అయినపుడు...
చట్టం కొందరికే చుట్టం అయినపుడు....
చట్ట సభలు చెత్త సభలు అయినపుడు...
ఎవ్వరూ కాపాడలేరీ దేశాన్ని"... అంటుంటే

అడుగుతున్నా ఆపుకోలేక్ ఆక్రోశాన్ని...
దేవుడా నువ్వైనా కాపాడు నా దేశాన్ని....
వినిపించు వేదమంత్రాల్ని....
నిలబెట్టు నీ గీతా సారాన్ని...

No comments: