రైలుకట్ట కథలు
రైలు
బ్రేకేజి
అ |
ది 1992 వ సంవత్సరం డిసెంబరు నెల. రాత్రి 12 దాటి ఒక పది
నిముషాలైంది. మంచం ప్రక్కనే ఉన్న రైల్వే ఆటో ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మంటూ మోగింది. అప్పుడే
మూగన్నుగా నిద్రపడుతోందేమో, మొదటి రింగుకే లేపి చెవిలో పెట్టుకున్నా. ఆన్ డ్యూటీ స్టేషన్
మాస్టరు కె.వి.సుబ్బారావు…“విశ్వనాథ్… ఎలమంచిలి – రేగుపాలెం స్టేషన్ల మధ్య అప్ లైను
లో 717 కి॥మీ దగ్గర ‘కొండపల్లి’ కోల్ లోడు గూడ్సుట్రయిన్ ఆగిపోయింది. డ్రైవర్ రైలు
బ్రేకేజి అని రెపోర్ట్ చేశాడు. కంట్రోల్ నిన్ను అర్జెంటుగా బయలుదేరమంటున్నాడు. దాని
వెనకాల కోణార్క్ ఎక్స్ ప్రెస్, పూరీ-తిరుపతి బళ్ళు ఆగిపోతున్నాయి. వెళ్ళి ట్రాక్ అటెండు
అయితే కానీ బళ్ళు కదిలే పరిస్థితి లేదు” అని ఫోన్ లో చెప్పాడు.
అప్పటికి ట్రాక్ మైంటెనెన్స్ విభాగంలో చేరి సరిగ్గా ఒక
నెల కూడా కాలేదు. రైలు కట్టమీద పూర్తి అవగాహన కూడా రాలేదు. ట్రయినింగు పూర్తికాగానే
1992 మే నెలలో హైదరాబాదు నుంచి తునికి బి.సి.ఎం మెషీన్ మీద పి.డబ్ల్యు.ఐ గా, ఎ.ఇ.ఎన్
కంట్రోల్ లో పోస్టింగు చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అది పట్టుకుని వచ్చి, విజయవాడ డి.ఆర్.ఎం.
ఆఫీసు లో రిపోర్ట్ చేసి, అక్కడినుంచి తుని వచ్చి ఎ.ఇ.ఎన్ శ్రీ అచ్యుతరావు గారికి రిపోర్ట్
చేశాను. ఒక మూడు నెలలు మెషీన్ మీద, తరువాత ఆ మెషీన్ సికిందరాబాదు డివిజన్ కి వెళ్ళి
పోవడంతో, స్పెషల్ వర్క్స్ చూడడానికి తాత్కాలికంగా పిఠాపురం సెక్షనుకి పంపించారు. ఈ
ఆరునెలల్లో నా పని విధానం చూసిన సీనియర్ డి.ఇ.ఎన్ శ్రీ సంతోష్ కుమార్ మిశ్రా, నన్ను
తుని ట్రాక్ మెయింటెనెన్స్ విభాగానికి ఉత్తర్వులివ్వడం జరిగింది. నా సెక్షన్ హంసవరం
నుంచి నర్సీపట్నం ఇవతలి వరకు 24 కి॥మీ॥.
ఎలమంచిలి సెక్షన్ శ్రీ దినవాహి వెంకట్రావు గారిది. శనివారం
వస్తే ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం చెక్కేయడం ఆయనకు షరా మామూలు. ఆయన భార్య సింహాచలం
దగ్గర అడవివరం లో పనిచేస్తూ ఉంటారు. ఛీప్ పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ శ్రీ రామవరపు నరసింగరావు
గారికి ప్రతీవారం ఇదో పీక మీద కత్తి. ఫామిలీ ఫ్రెండు అయిన పాపానికి వెంకట్రావు గారిని
ఏమీ అనలేక, ఆయన విశాఖపట్టణం వెళ్ళిన ప్రతీ శనివారం ఈయనే యలమంచిలి వెళ్ళి కాంపు చేసే
వారు. ఈ శనివారం ఆయనకి తప్పని సరి పని ఉండటంతో చాలా బ్రతిమలాడుతూ, “వెంకట్రావుగారూ…ఈ
ఒక్క శనివారం మీరు విశాఖపట్నం వెళ్ళొద్దు. నేను కూడా ఉండటం లేదు. ఏదైనా అనుకోని అవాంతరం
వస్తే ఇద్దరం ఇబ్బంది పడతాం. అసలే కొత్త ఛీఫ్ ఇంజినీరు చాలా స్ట్రిక్ట్. సెక్షన్ లో
ఎక్కడైనా బండి ఆగితే ఛార్జ్ షీట్ ఇస్తున్నాడు” అంటూ ఒకటికి పది సార్లు చెప్పారు. అయినా
మామూలే. సరే అని ఊ కొట్టి, ఈయన ఉద్యోగం ట్రాలీమేను సన్యాసిరావు కి అప్పచెప్పి, విశాఖపట్టణం
బండి ఎక్కేసారు.
కబురు అందుకున్న వెంటనే నైటు వాచ్ మన్ రామారావుకి ఫోనులో,
నా ట్రాలీమెన్ కోటిపల్లి సత్యనారాయణ, గొర్ల రాంబాబు, దొడ్డా వెంకటేశ్వర్లు, కమ్మరి
మేస్త్రి నాగభూషణానికి కబురు చేసి, వాళ్ళని అవసరమైన సామాను తీసుకుని స్టేషనుకు రమ్మని
చెప్పాను. అలాగే ఎలమంచిలిలో ఉండే వాచ్ మేనుకు కూడా స్టేషను మాస్టరు ద్వారా కబురు చేసి
ఏడో నెంబరు గాంగు మేస్త్రి నాగం మీరాని మనుషులని తీసుకుని దొంగల గడ్డ దగ్గరకి రమ్మని
కబురు చేశాను. మొదటి దొరికే బండిలో తుని నుంచి బయలుదేరి ఆగిపోయిన బండి దగ్గరకి చేరేసరికి
కనీసం గంటా…గంటన్నర పడుతుంది. అదే విషయం కంట్రోలర్ కి చెప్పి అంతవరకు సింగిల్ లైన్
వర్కింగ్ లో బళ్ళు పంపించవలసి ఉంటుందని చెప్పాను. పదినిముషాల్లో ట్రాలీమెన్, కమ్మరి
మేస్త్రీలతో సహా తుని స్టేషనుకి చేరుకున్నాను. అదృష్టం కొద్దీ డౌను లైనులో అప్పుడే
గూడ్సు ట్రయిన్ ఒకటి బ్లాక్ అవడంతో, ఆ బండిలో మమ్మల్నందర్నీ ఎలమంచిలి వెళ్ళడానికి ఎక్కించారు.
సుమారు గం॥ 1:30 ని॥ల కల్లా మేము ఎక్కిన గూడ్సు ట్రయిన్
స్పాటుకి చేరుకుంది. మమ్మల్ని సెక్షన్ లో దింపేసి, ముందుకు వెళ్ళిపోయింది. డిసెంబరు
నెల చలి…గజ గజలాడిస్తోంది... అమావాశ్య దగ్గరలో అనుకుంటా.. చీకటి కూడా చిక్కగా ఉంది…
చేతిలో టార్చిలైటు పట్టుకుని ఆగిపోయిన కొండపల్లి ఇంజిన్ దగ్గరికి చేరుకున్నాం… డ్రయివర్
చిట్టిబాబు.. పరిచయస్థుడే… గార్డు గాబ్రియేలు... నా ఎదరగుండా క్వార్టర్లోనే ఉంటుంటాడు.
నన్ను చూడగానే… “సార్.. ఇంజిన్ నుంచి 24 బోగీ క్రింద సార్… రైలు విరిగిపోయింది. తుని
వైపు పట్టా దాదాపుగా అడుగు క్రిందకి దిగిపోయింది. గాప్ కూడా బాగా లాగింది” అన్నాడు
గాబ్రియేలు. నెమ్మదిగా చూసుకుంటూ రైలు విరిగిన
దగ్గిరకి వెళ్ళాం. అదే టైముకి నాగం మీరా కూడా ఒక ముగ్గురు గాంగ్ మన్ లని తీసుకుని అక్కడికి
చేరుకున్నాడు. పరిస్థితి చూడగానే ఏం చేయాలో అర్థం కాలేదు. వెల్డింగు జాయింటుకి మధ్యలో
రైలు విరిగి పోయి, దాదాపుగా ఎనిమిది అంగుళాలు గ్యాపు వచ్చేసింది. తుని వైపు స్లీపరు
బాగా దూరంగా ఉండటంతో, రైలు కమ్మి దాదాపుగా అడుగు క్రిందకి దిగి పోయింది. సాధారణంగా
రైలు జాయింట్లు రెండు స్లీపర్లకి మధ్యలో ఉండేలా అమర్చబడి ఉంటాయి. అప్పుడు పొరపాటున
వెల్డింగు జాయింటు విరిగినా, వెంటనే పట్టీలు కట్టి సరిచేసి పంపించడానికి వీలౌతుంది.
కానీ ఇక్కడ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. రైలు క్రిందకి దిగిపోవడమే కాదు, గ్యాప్
కూడా చాలా ఎక్కువగా, పట్టీ కట్టడానికి కూడా వీలుగా లేదు. వాగన్ కి వెనక వైపు బోగీ లో ముందు చక్రం తుని వైపు
రైలు మీద, వెనక చక్రం యలమంచిలి వైపు రైలు మీద ఉన్నాయి. రెండు చక్రాలు ఏదో ఒక ప్రక్కకొస్తే
కానీ కనీసం రైలుకి పట్టీకట్టే ప్రయత్నం కూడా చేయలేం. అప్పటికే టైం రెండు దాటి పది నిముషాలైంది.
అంటే, బండి ఆగి పోయి దాదాపు రెండు గంటలు పైన అయింది. ఏమి చేయడానికీ పాలు పోవడం లేదు.
చుట్టూ ఉన్న వాళ్ళు నా నిర్ణయం కోసం చూస్తున్నారు.
కొంచెం ఆలోచించి,
డ్రైవర్ చిట్టిబాబుతో, “చిట్టిబాబు గారూ… కప్లింగు కట్ చెద్దామా ? కప్లింగు కట్ చేసి,
బండిని ఒక బోగీ లెంతు ముందుకు తీసుకువెళ్తే, పట్టీ కడదాం” అన్నాను. “చాలా రిస్కు సార్…
ఎఇర్ ప్రెషర్ అఫెక్ట్ అయి, బ్రేకులు పట్టేసాయంటే బండి కదలదు సార్.. తరవాత అందరం ఇబ్బంది
పడతాం. అంతే కాదు, రైలు కి రైలు కి దాదాపు అడుగు ఎత్తు తేడా ఉంది. బండి లాగేటప్పుడు
చక్రం సరిగా లాండ్ కాకపోతే, మొత్తానికి డీరైలుమెంటు అవుతుంది. అంత రిస్కు అవసరమా?”
అన్నాడు. “చిట్టిబాబు గారూ.. పరిస్థితి చూస్తున్నారు కదా ! ఏదో ఒక పక్కకి చక్రం కదిలితే
గానీ మనం ఏమీ చెయ్యలేం. లేదంటే, బి.డి స్పెషల్
రావలసిందే. ధైర్యం చెయ్యకపోతే ఏమీ కాదు. కావాలంటే కప్లింగు కట్ చెయ్యిమని రాత పూర్వం
గా ఇస్తాను” అన్నాను. “సరేసార్.. మీరు మీ ఉద్యోగానికి రిస్కు తీసుకుంటున్నారు, గార్డు
గాబ్రియేలు కూడా ఒప్పుకుంటే, నేను రెడీ సార్” అన్నాడు చిట్టిబాబు. గాబ్రియేలు కూడా,
“మీరు రిస్కు తీసుకుంటున్నారు కాబట్టి సరే సార్” అన్నాడు. ఏదైతే అయిందని భగవంతుడిమీద
భారం వేసి, కప్లింగు కట్ చేశాము. చేతి లాంతరు తో సిగ్నల్ చూపిస్తుంటే, చిట్టిబాబు బండిని
నెమ్మదిగా ముందుకు కదిలించాడు. అంతటి చలిలో
కూడా అందరికీ చెమటలు పడుతున్నాయి. ఎవ్వరం ఊపిరి తీస్తున్నట్టు లేదు. నరాలు తెగే ఉత్కంఠ.
నెమ్మదిగా రెండవ చక్రం కూడా తుని వైపు రైలు మీదకి దిగింది.
చిట్టిబాబు అలాగే
నెమ్మదిగా ట్రైనుని ఒక వాగన్ లెంతు ముందుకి తీసుకు వెళ్ళాడు. వెంటనే ట్రాలీ మేనులు,
గ్యాంగు కలిసి కిందికి దిగిపోయిన స్లీపర్లని, గునపాలతో పైకి లేపి, ప్యాకింగు చేశారు.
నెమ్మదిగా రెండు రైలు పట్టాలు ఒక లెవల్ కి లేపగలిగాము. జాగుల్డ్ ఫిష్ ప్లేట్లు అమర్చి,
ఒక పక్క రెండు బోల్టులు, ఒక పక్క క్లాంపు కట్టి, క్రింద ఒక చెక్క బ్లాకు పెట్టి, పాకింగ్
చేశాము. అంతా సవ్యంగా ఉందనుకున్న తరువాత, గార్డు గాబ్రియేల్ కి, డ్రైవర్ చిట్టిబాబుకి
బండిని బ్యాక్ చేసి, కప్లింగు వేయడానికి రెడీ చెప్పాను. గాబ్రియేల్ సిగ్నల్ చూపిస్తుంటే,
చిట్టిబాబు నెమ్మదిగా ట్రైను బ్యాక్ చేశాడు. సి.బి.సి కప్లింగు పూర్తిగా కూర్చుందని
నిర్ధారించుకున్నాక బ్రేక్ పైపులు కనెక్ట్ చేసి, బ్రేక్ పవర్ చెక్ చేసుకున్నాడు చిట్టిబాబు.
బ్రేక్ పవర్ పూర్తిగా వచ్చిందని తేల్చుకున్నాక,
“సర్.. బండి రెడీ… మీరు ట్రాక్ సురక్షితంగా ఉందంటే, బయలు దేరదాం” అన్నాడు. నేను వెంటనే,
ట్రాక్ 30 కి॥మీ॥ వేగానికి ఫిట్ అని సర్టిఫికేట్ రాసి, చిట్టిబాబు కి ఇచ్చి, ఆ ఫిట్
మెమో పక్కన రేగుపాలెం స్టేషన్ లో ఉచ్చి తరవాత వచ్చే అన్ని బళ్ళకి కాషన్ ఆర్డర్ ఇవ్వమని
చెప్పాను. అప్పటికి టైము దాదాపుగా మూడు కావస్తోంది. స్పాట్ నుంచి బయలుదేరిన కొండపల్లి
గూడ్సు ట్రైను రేగుపాలెం చేరి, దాని తరవాత వచ్చే బండి స్పాట్ దాటితే కానీ, నేను స్పాట్
వదిలి వెళ్ళలేను. మొత్తానికి, మరో ఇరవై నిముషాల తరవాత రెండోబండి కాషన్ ఆర్డర్ లో రైలు
విరిగిన స్పాట్ ని దాటుకుని వెళ్ళింది. దాంతో అందరం ఆ చీకట్లో నడుచుకుంటూ ఎలమంచిలి
స్టేషన్ కేసి బయలుదేరాం.
ఉదయాన్నే చీఫ్ పి.డబ్య్లు.
ఐ శ్రీ రామవరపు నరసింగరావుగారు యలమంచిలి స్టేషనుకి వచ్చారు. ఆయనకి రాత్రి జరిగిందంతా
వివరంగా చెప్పాను. “ఏం చేశావు… మళ్ళీ చెప్పు” అన్నారు. చెప్పాను. ఒక్కసారిగా గుండెలమీద
చేయి వేసుకున్నారు. “నీకు కప్లింగ్ కట్ చేయడానికి ధైర్యం ఎలా వచ్చింది?” అన్నారు.
“అంతకంటే మార్గం కనపళ్ళేదు సార్” అన్నా… “717 కిలోమీటర్ దగ్గ్ర గ్రేడియంట్ ఎంతో తెలుసా
?” అన్నారు. “తెలియదు సర్” అన్నా… “అక్కడ గ్రేడు 1 ఇన్ 100 రైజింగ్. ఒకవేళ బ్రేక్ పవర్
ఫెయిల్ అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా…ఫార్మేషన్ వెనకాల ముక్క దొర్లడం ప్రారంభించిందంటే,
కనీసం బయ్యవరం గేటు దాకా ఎక్కడా ఆగదు. అప్పటికే యలమంచిలి యార్డులో రెండు లైనుల్లో రెండు
బండ్లు ఆగి పోయి ఉన్నాయి.ఈ ముక్క తిన్నగా వెళ్ళి, మెయిన్ లైను లో ఆగి ఉన్న గూడ్సు ట్రయిన్
నో, లేకపోతే రాంగ్ లైనులో పంపించడానికి షంటింగ్ తీసుకుంటున్న పూరీ తిరుపతి ఎక్స్ ప్రెస్
నో ఢీ కొట్టి ఉంటే, పరిస్థితి ఏంటి? ఎంత రిస్కు తీసుకున్నావో నీకేమైనా అర్థం అవుతోందా?
నీ అదృష్టం, నా అదృష్టం బాగుండబట్టి ఈ రోజు ఇలా తెల్లారింది.” అంటూ కశింకోట వైపు తిరిగి,
సత్యన్నారాయణ స్వామి కి ఒక నమస్కారం పెట్టారు. ఆయన చెప్పింది అర్థం అవడానికి నాకో రెండు
నిముషాలు పట్టింది. ఆ తరవాత ఒక్కసారిగా ఆలోచన స్థంభించి పోయింది. నేను చేసింది ఎంత
మూర్ఖమైన పనో...ఎన్ని ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నానో అర్థం అయింది. నిజంగా సత్యమైన
దేవుడు, ఆ సత్యనారాయణుడే మమ్మల్నందర్నీ కాపాడాడని మనఃస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకున్నా...కొసరుగా
నా కిలాంటి అనుభవం మిగిల్చిన శ్రీ దినవాహి వెంకట్రావు గారికి కూడా.
జీవితం అనుభవాల్నిచ్చి
పాఠాలు నేర్పుతుందంటారు. కానీ ఇలాంటి అనుభవాల్నించి నేర్చుకున్న పాఠాలు జీవితాల్ని
నేర్పుతాయి.
--లలితా వేంకట సూర్య విశ్వనాథం కూచిభొట్ల
* * *
No comments:
Post a Comment